*మహిళలు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవాలి : అదనపు ఎస్పీ నర్మద*
- - షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినీలకు సెల్ఫ్ డిఫెన్స్ విధానాల పట్ల శిక్షణలు
- - డయల్ 100 పై అవగాహన కార్యక్రమాలు
- - మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం
నల్గొండ : మహిళలు, విద్యార్థినీలు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవడం ద్వారా ఆపద సమయాలలో తమను తాము రక్షించుకోవచ్చని జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సి.నర్మద అన్నారు.
మంగళవారం షీ టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ శివారు చర్లపల్లిలోని తెలంగాణ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థినీలు, మరో ఆరు బాలికల జూనియర్ కళాశాలల విద్యార్థినీలకు సెల్ఫ్ డిఫెన్స్ విధానాలపై శిక్షణ, పోలీస్ శాఖ మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, డయల్ 100 పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న అదనపు ఎస్పీ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా నా పోలీస్ - నా భద్రత పేరుతో మహిళల భద్రత, రక్షణ అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు షి టీమ్స్ ఆధ్వర్యంలో 2కె రన్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహించామని, ఇక పై జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ పై అనుభవం కలిగిన శిక్షకులచే శిక్షణ ఇస్తున్నామని ఆమె తెలిపారు. ప్రస్తుత రోజులలో మహిళలకు స్వీయ రక్షణ చాలా అవసరమని అందుకే సెల్ఫ్ డిఫెన్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థినీలు ఆపద సమయాలలో ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే విధంగా ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె చెప్పారు. కేవలం ఆకతాయిల బారి నుండే కాకుండా చైన్ స్నాచింగ్, మహిళలపై లైంగిక దాడులు జరిగే క్రమంలో వారిని సమర్ధవంతంగా తిప్పికొట్టడం లాంటి టెక్నిక్స్ నేర్పించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలకు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ మార్గదర్శకత్వంలో చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు. స్వీయ రక్షణ విధానాలతో పాటుగా విద్యార్థినీలు, మహిళలు పెప్పర్ స్ప్రే అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. స్వీయ రక్షణ విధానాలు అనేక రకాలు ఉన్నాయని వాటన్నింటిని యూ ట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకోవాలని ఆమె తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్క మహిళ స్వీయ రక్షణ విధానాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆమె చెప్పారు. తెలంగాణ పోలీసులు మహిళలు, విద్యార్థినీల భద్రత, వారి రక్షణ కోసం నిరంతరం పని చేస్తున్నాయని, షీ టీమ్ పోలీసులు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ తదితర ప్రాంతాలలో సివిల్ దుస్తులతో సంచరిస్తూ ఆకతాయిల బారి నుండి రక్షణ కల్పించే విధంగా పని చేస్తున్నారని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం కళాకారులు మహిళల రక్షణ, పోలీస్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, చేపడుతున్న చర్యలపై ఆలపించిన పాటలు అందరిని అలరించాయి.
కార్యక్రమంలో తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జనార్దన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వి. సత్య, షిటీమ్స్ సిఐ రాజశేఖర్ గౌడ్, రాణి రుద్రమాదేవి కరాటే అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ శిక్షకులు లక్ష్మీ, రవి, షీ టీమ్స్ ఏ.ఎస్.ఐ. సోమి రెడ్డి, విజయ లక్ష్మి, సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, నర్సింహా, సైదులు, సురేష్, హుస్సేన్, కళాబృందం సిబ్బంది పాల్గొన్నారు.